ముస్లింలకు ఇచ్చి కాపులకు ఎందుకివ్వరు


ఆదివారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో జీవీఎల్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని పేర్కొన్నారు. ముస్లింలకు రాష్ట్రంలో ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారని, అదే విధంగా కాపులకు కూడా ఇవ్వాలని జీవీఎల్ ప్రస్తావించారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ముస్లింలు అంటే ప్రేమ.. కాపులంటే ద్వేషమా? అని ప్రశ్నించారు వీర్రాజు. వారికి ఇచ్చినప్పుడు.. కాపులకు ఎందుకు ఇవ్వకూడదని నిలదీశారు.

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టారని పేర్కొన్నారు. ఇలా ఏపీలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు.అలాగే, నేచర్ క్యూర్ హాస్పటల్ హైదరాబాద్‌లో ఉందన్న వీర్రాజు.. 25 ఎకరాలను కేటాయించి ఏపీలోనూ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందన్నారు. గన్నవరం మండలంలో ఈ ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిందన్నారు. సామర్లకోటలో సెంట్రల్ ప్లాంటేషన్ కార్పొరేషన్ నిర్మాణానికి గతంలో అడిగారన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన స్థలాలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు సోము వీర్రాజు. ఆ స్థలాలను జగనన్న ఇళ్లకు కేటాయించారని పేర్కొన్నారు. ఈ చర్యతో అభివృద్ధి నిరోధకులుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వీర్రాజు విమర్శలు గుప్పించారు. కేంద్రం ఆమోదం తెలిపాక ఇచ్చిన స్థలాలని వెనక్కి తీసుకుంటారా? అని ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కేంద్రం ప్రాజెక్టులు పెడతానన్నప్పటికీ వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. ఇక కేంద్ర హోంశాఖ విడుదల చేసిన లేఖ వివాదంపై సోమువీర్రాజు తనదైన శైలిలో స్పందించారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశం అని, 17వ తేదీన సమావేశంలో ఏపీ, తెలంగాణ ఆస్తుల అంశంపై చర్చ జరుగుతుందన్నారు. తెలంగాణకు సంబంధం లేని అంశం కాబట్టే అది తొలగించారని వివరించారు. హోదాపై ప్రత్యేక సమావేశం పెట్టి చర్చించాలన్నారు. గత ప్రభుత్వం కొన్ని అంశాలలో పెట్టుబడులు తీసుకున్నారని, కేంద్రం ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి నిధులు ఇచ్చిందని వీర్రాజు గుర్తు చేశారు.