భీమ్లా నాయక్' విడుదల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ రేట్స్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆర్ఆర్ఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం.రాజకీయ పరంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మధ్య వైరుధ్యం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ కారణం వల్లే 'వకీల్ సాబ్' విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదని, థియేటర్లలో టికెట్ రేట్స్ తగ్గించిందని కొంతమంది వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ సినిమా కోసమే సినీ పరిశ్రమను టార్గెట్ చేశారని కొందరు కామెంట్స్ చేశారు. ఇటీవల మంత్రి పేర్ని నాని ఆ విమర్శలను ఖండించారు.
అదంతా గతం! దాన్ని పక్కన పెడితే.. ఈ నెల 25న పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎంపీ రఘురామకృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్) వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితర ప్రముఖులు చిత్రపరిశ్రమ సమస్యలపై చర్చించడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళినప్పుడు సరిగా మర్యాద ఇవ్వలేదని, బయట నుంచి నడిపించారని..బావ విష్ణు మంచు వెళ్ళినప్పుడు మర్యాద ఇచ్చారని రఘురామకృష్ణంరాజు బుధవారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
భీమ్లా నాయక్' విడుదల గురించీ మాట్లాడారు."ఫిబ్రవరి 25న మా అభిమాన హీరో సినిమా (భీమ్లా నాయక్) వస్తోంది. మీరూ, మీ బావ ఏం మాట్లాడుకున్నారో? 25లోపు టికెట్ రేట్స్ పెంచండి. ఈ సినిమాకు పెంచకుండా, మీ లాయర్ (నిరంజన్ రెడ్డి) నిర్మించిన 'ఆచార్య' సినిమాకు పెంచితే ప్రజలు మరింత దుమ్మెత్తి పొసే అవకాశం ఉంది. 'భీమ్లా నాయక్' విడుదలకు ముందే ఎన్ని షోలు ఇస్తారు? రేట్ ఎంత? అనేది డిసైడ్ చేయండి" అని రఘురామకృష్ణంరాజు అన్నారు. ముఖ్యమంత్రికి ఇదొక శీలపరీక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 25లోపు టికెట్ రేట్స్ తెలుస్తారో? లేదంటే బిజీగా ఉండి ఈ సినిమా విడుదలైన తర్వాత తెలుస్తారో? చూడాలని ఆయన అన్నారు.