జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కొత్త చిక్కు?

 


అమరావతి, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కొత్త చిక్కు వచ్చిపడింది. ఉద్యోగుల విభజన విషయంలో జోనల్‌ సమస్యలు ముందుకొచ్చాయి. ప్రత్యేకించి నెల్లూరు, చిత్తూరు జిల్లాల విభజనలో ఆయా రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించడంతో ఈ సమస్య ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచే జోనల్‌ విధానం కొనసాగుతోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆయా ప్రాంతాలను జోన్లుగా విభజించారు. ఏపీకి సంబంధించి రాయలసీమ జిల్లాలు జోన్‌-4లో ఉన్నాయి. నెల్లూరు జిల్లా జోన్‌- 3లో ఉంది. జిల్లాల పునర్విభజనలో నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని సూళ్లూరుపేట, ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, తడ.. నెల్లూరు డివిజన్‌లోని రాపూరు, ఆత్మకూరు డివిజన్‌లోని కలువాయి, గూడూరు డివిజన్‌లోని గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడ,  చిట్టమూరు, వెంకటగిరి, సైదాపురం, డక్కిలి, బాలాయపల్లి మండలాలను కొత్తగా తిరుపతి కేంద్రంగా ఏర్పాటుకానున్న శ్రీ బాలజీ జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. మరో రెండు జిల్లాల పరిధిలోనూ సమస్య ఉందని అధికార వర్గాలు గుర్తించాయి. ఒక జోన్‌ను విభజించి అందులోని ఉద్యోగులను మరో జోన్‌కు అలాట్‌ చేయడం కుదరదు. అలా చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాలి. ఇది ఇప్పటికిప్పుడు అయ్యేపని కాదని, చాలా సమయం తీసుకుంటుందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విభజనను వెంటనే చేపట్టే అవకాశం లేదు. జోనల్‌ విధానంలో చేసే మార్పులపై రాష్ట్రపతి ఆమోదం తీసుకున్నాకే దానిని అమలు చేయాలి. దీంతో అప్పటి వరకు ఆర్డర్‌ టూ సర్వ్‌ విధానం అమలు చేయనున్నారు. అయితే ఇది రెండు జిల్లాలకే  పరిమితం చేస్తారా.. లేక రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందా అన్నదానిని ప్రభుత్వం త్వరలోనే తేల్చనుంది. అయితే ఇప్పటికిప్పుడు ఉద్యోగుల విభజన ఉండదని ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ వెల్లడించారు. కొన్ని జోనల్‌ చిక్కులున్నాయని అంగీకరించారు. అవి పరిష్కారమయ్యేవరకు ఆర్డర్‌ టూ సర్వ్‌ విధానం అమలవుతుందన్నారు. జోనల్‌ సమస్య పరిష్కారం అయ్యాకే విభజనలో ఉద్యోగులు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చునని తెలిపారు.  ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయకుమార్‌ ఆధ్వర్యంలో 4 జిల్లాల కలెక్టర్లతో జరిగిన భేటీకి పలు ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా హాజరయ్యారు. కొన్ని జిల్లాలకు పెట్టిన పేర్లపై వస్తున్న అభ్యంతరాలు, సూచనలపై చర్చ జరిగింది. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని, ఎన్‌టీఆర్‌ పేరు మచిలీపట్నం జిల్లాకు పెట్టాలన్న ప్రతిపాదనలపై చర్చించారు. కాగా, జిల్లాల పునర్విభజనపై మార్చి 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు విజయ్‌కుమార్‌ చెప్పారు. మార్చి 10 నాటికి అన్ని అభ్యంతరాలపై స్పష్టత వస్తుందని, జిల్లాలపై తుది నోటిఫికేషన్లు విడుదలవుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగానే ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందన్నారు.