రష్యా ఉక్రెయిన్ల మధ్య గత కొద్ది రోజులుగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైన్యం భారీగా బలగాలను సైనిక పరికరాలను మోహరించింది. దీంతో యుద్ధం తప్పదన్న అంచనాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే అమెరికా సైతం యుక్రెయిన్ పై రష్యా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. కానీ రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు.కాగా ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు చెందిన దాదాపు 200 మంది విద్యార్థుల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ గొడవ వల్ల తమ చదువులు పాడైపోతున్నాయని చాలా మంది వాపోతున్నారు.
మోతీనగర్కు చెందిన సోహైల్ మహమ్మద్ తాజాగా ఇక్కడి మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్లో చదువుతున్న విద్యార్థులకు ఏమి అందుబాటులో ఉందో తనకు తెలియదని అన్నారు. “మా చదువులకు ఆటంకం కలగకూడదనుకుంటున్నాం. మా తదుపరి సెమిస్టర్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతుందని మాకు చెప్పారని.. కానీ యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో అంతా అయోమయంగా ఉందని”అని అతను చెప్పాడు. సోహైల్ ఉక్రెయిన్లో మెడిసిన మూడో సంవత్సరం చదువుతున్నాడు.
ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం ద్వారా భారతీయ విద్యార్థులందరూ ఫారమ్లను పూరించాలని కోరారు. వారు తమను ఎంబసీలో నమోదు చేసుకున్నారు. పేరు జెండర్ వయస్సు పాస్పోర్ట్ నంబర్ ఉక్రెయిన్లోని స్థానం.. భారతదేశంలోని వారి నివాస రాష్ట్రం వంటి వివరాలను అందించాలని వారిని భారత ఎంబసీ కోరింది.. పరిస్థితి మరింత దిగజారితే ఉక్రెయిన్ నుంచి బయటకు పంపిస్తామని రాయబార కార్యాలయం విద్యార్థులకు హామీ ఇచ్చింది.
ఉక్రెయిన్లో వివిధ వైద్య -ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయాలలో దాదాపు 18000 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారని భారత రాయబార కార్యాలయ వెబ్సైట్ పేర్కొంది.
ప్రస్తుతం పరిస్థితి మామూలుగానే ఉందని రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదని విద్యార్థులు తెలిపారు. వారు ఉక్రెయిన్లో విద్యను అభ్యసించడానికి చాలా డబ్బు ఖర్చు చేసినందున యుద్ధం వస్తే తమ చదువులు నాశనమవుతాయని వారంతా ఆందోళన చెందుతున్నారు.